: మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు..!
ప్రతి యేటా కోట్ల కొద్దీ రూపాయల బ్యాంకు ఖాతాదారుల డబ్బును హ్యాకర్లు కాజేస్తున్నారు. దీనికి కస్టమర్ల అజాగ్రత్త, అత్యాసే ప్రధాన కారణమంటే అతిశయోక్తి కాదు. ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. అందివచ్చిన అధునాత సాంకేతికత బ్యాంకింగ్ లావాదేవీలను అరచేతిలో ఇమిడ్చింది. ఒక స్మార్ట్ ఫోన్ యాప్ ను వాడి అన్ని రకాల బ్యాంకు చెల్లింపులు జరుపుకునే సౌలభ్యం లభించింది. అయితే, ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఎంత వరకూ సురక్షితమన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. వీటిని వాడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో కొన్ని... మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వాడేవారు పాటలు, సినిమాలు తదితర పైరేటెడ్ కంటెంట్ ను డౌన్ లోడ్ చేసుకోకూడదు. అనుమతులు లేని వెబ్ సైట్ల నుంచి సాఫ్ట్ వేర్, సినిమాలు స్మార్ట్ ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మీ సమాచారం సులువుగా హ్యాకర్లకు దొరికిపోతుంది. ఇక మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. పాత సిస్టమ్ నే కొనసాగిస్తుంటే హ్యాకర్ల పని సులువవుతుంది. ఈ విషయంలో బ్యాంకులు సైతం కొత్త టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఫైల్స్ డీకోడ్ ను మరింత క్లిష్టతరం చేస్తుంటాయి. దీంతో పాటు స్పామ్ మెసేజీలకు అడ్డుకట్ట వేసుకోవాలి. ఇది సులువైన పనే. అయితే, పొరపాటున వైరస్ లను మోసుకొచ్చిన స్పామ్ ను ఓపెన్ చేస్తే క్షణాల్లో అది మొబైల్ లోని మొత్తం సమాచారాన్ని దేశాలు దాటించేస్తుంది. ఇక మరో ముఖ్యమైన విషయం... ఉచితంగా వచ్చింది కదా అని వైఫై ద్వారా బ్యాంకింగ్ యాప్స్ వాడకుంటేనే మంచిది. వైఫై సిగ్నల్ పంపుతున్న సంస్థ నుంచి మీ మొబైల్ లోకి ఎవరైనా సులువుగా దూరిపోవచ్చు. ఈ విషయంలో ఓక్క ఫిర్యాదు వస్తే ఆ ఐపీ అడ్రసును బ్యాంకులు బ్లాక్ లిస్టులో పెడుతున్నాయి. మీ ఫోన్ పోగొట్టుకుని అది హ్యాకర్ల చేతికి చిక్కితే, చాలా సులువుగా దాని లాక్ తీసి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు తెలుసుకుంటారు. ఫోన్ పోయిందని తెలిసిన మరుక్షణం, ఐడీ నుంచి పాస్ వర్డ్ ల వరకూ మొత్తం మార్చివేయాలి. ఉపయోగించే పాస్ వర్డ్ బలంగా ఉండాలి. ఏ బ్యాంకు లావాదేవీ జరుపుతున్నా వన్ టైం పాస్ వర్డ్ ను బ్యాంకు నుంచి తీసుకోవాలి. ఈ తరహా జాగ్రత్తలు పాటిస్తే మీ మొబైల్ బ్యాంకింగ్ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టదు.