: జానా కూడా జంపేనా?... వినోద్ భేటీపై కాంగ్రెస్ లో జోరందుకున్న చర్చ


కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తప్పేలా లేదు. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయంతో పార్టీ పెద్దలు షాక్ తిన్నారు. తాజాగా ఆ పార్టీ మరో సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో పార్టీ నేత కుందూరు జానారెడ్డి కూడా రాజీనామా చేయనున్నారన్న పుకార్లు జోరందుకున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ నిన్న జానారెడ్డిని కలిశారు. నేరుగా జానారెడ్డి ఇంటికి వచ్చిన వినోద్ కుమార్ దాదాపు 10 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతూ, పుస్తకావిష్కరణ కోసం జానారెడ్డిని ఆహ్వానించేందుకే వచ్చానని వినోద్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం వినోద్ మాటలను ఏమాత్రం నమ్మడం లేదు. ఇటీవల జానారెడ్డి టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండటం, వరుసగా టీఆర్ఎస్ నేతలతో భేటీ అవుతుండడాన్ని గుర్తు చేస్తున్న పార్టీ నేతలు... జానారెడ్డి పార్టీ వీడటం ఖాయమేనని గుసగుసలాడుకుంటున్నాయి. ఇదే జరిగితే, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News