: 'చింతామణి' కేసులో అరెస్టైన ఐదుగురు కానిస్టేబుళ్లు


ఔషధ రాయి 'చింతామణి'ని ఓ వ్యక్తి దగ్గర్నుంచి కాజేసి, దాని సొంతదారుకు విక్రయించే క్రమంలో ఐదుగురు పోలీసులు కటకటాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం గోపాలపురానికి చెందిన రామకృష్ణ జీడిపప్పు వ్యాపారి. ఆయనకు వ్యాపారంలో నష్టాలు రావడంతో, తన తాతల కాలం నాటినుంచి వస్తున్న విలువైన రాయి 'చింతామణి'ని అమ్మేశాడు. చింతామణి రాయిపై హిందువులకు చాలా నమ్మకం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రియశిష్యుడు సిద్ధప్ప ఏడవ తరానికి చెందిన 'చింతామణి' రామకృష్ణ తాతల కాలం నుంచి అతని కుటుంబానికి వారసత్వంగా వస్తోంది. ఈ ఔషధ రాయిని పాలల్లో కలిపి వివిధ రోగాలు నయం చేస్తున్నారు. వ్యాపార నష్టాల కారణంగా హైదరాబాదు, దిల్ షుక్ నగర్ కు చెందిన వడ్డీ వ్యాపారి రామిరెడ్డికి ఈ రాయిని 25 లక్షల రూపాయలకు అమ్మేశారు. రామకృష్ణ దగ్గర్నుంచి కొన్న రాయిని రామిరెడ్డి అమ్మకానికి పెట్టారు. ఇది తెలుసుకున్న కరీం అలియాస్ రషీద్ దానిని అమ్మేందుకు ఓయూ క్యాంపస్ కు రావాలని పిలిచారు. రాయితో ఓయూకు వచ్చిన రామిరెడ్డిపై ఐదుగురు స్పెషల్ కానిస్టేబుళ్లు దాడిచేసి దానిని, 14 వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లను ఎత్తుకుపోయారు. అనంతరం పథకం ప్రకారం రామిరెడ్డి సెల్ ఫోన్లలో ఉన్న రామకృష్ణకు పోన్ చేసి, తమ వద్ద 'చింతామణి' రాయి ఉందని, దానిని 25 లక్షల రూపాయలకు అమ్ముతామని చెప్పారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఆ రాయి తనదేనని, దానిని రామిరెడ్డికి అమ్మగా, ఆయన నుంచి వారు కాజేశారని పోలీసులకు తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఐదుగురు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి, జైలుకు తరలించారు. సూత్రధారి కరీం పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News