: పాకిస్థాన్ తో స్నేహమంటే, ఇండియాతో శత్రుత్వం కోరినట్టు కాదు: చైనా
పాకిస్థాన్ తో స్నేహంగా ఉన్నంత మాత్రాన ఇండియాతో శత్రుత్వం కోరుకుంటున్నట్టు కాదని చైనా మిలటరీ స్పష్టం చేసింది. ఇటీవల చైనా జలాంతర్గామి ఒకటి భారత జలాల గుండా కరాచీ పోర్టుకు వెళ్లిన విషయమై వివరణ ఇస్తూ, కరాచీకి జలాంతర్గామి వెళ్లడం వెనుక భారత్ ను కవ్వించాలన్న దురుద్దేశం తమకు లేదని చైనా సైన్యం ప్రతినిధి జియాంగ్ బిన్ బుధవారం నాడు బీజింగ్ లో మీడియాకు తెలిపారు. తమ సబ్ మెరైన్ శ్రీలంక, బంగ్లాదేశ్ తీరాలకు కూడా వెళ్లిందని గుర్తు చేసిన ఆయన రక్షణ రంగంలో పాకిస్థాన్ తో తమ బంధం ఈనాటిది కాదని గుర్తు చేశారు. చైనా, భారత్ దేశాధినేతల పరస్పర పర్యటనలతో ద్వైపాక్షిక బంధాలు బలపడ్డాయని అన్నారు. భారత్ కోరినా, పాక్ కోరినా సాయం చేసేందుకు చైనా సిద్ధంగా ఉంటుందని వివరించారు.