: ఎమ్మెల్యే కాకముందు తలసాని విలువెంత? సమాజంలో ఆయన గౌరవమెంత?: మంత్రి రావెల
కేసీఆర్, జగన్, టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లపై ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు ఫైర్ అయ్యారు. కేసీఆర్, జగన్ లు కుమ్మక్కై చంద్రబాబును దెబ్బతీయాలనుకున్నారని... చివరకు వారు తీసుకున్న గోతిలో వారే పడే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, వైకాపాల కుట్రలు ఇకపై కొనసాగబోవని అన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలంటూ టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై రావెల మండిపడ్డారు. తలసానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని... చంద్రబాబు హయాంలో పదవులను అనుభవించి, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన తలసానా మాట్లాడేది? అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాకముందు తలసాని విలువెంత? సమాజంలో ఆయనకు ఉన్న గౌరవం ఎంత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ పూరిత రాజకీయాలకు పాల్పడిన తలసానికి చంద్రబాబుపై, టీడీపీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని అన్నారు.