: రేవంత్ కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహకాలు... 10 వేల మందితో కొడంగల్ వరకు భారీ ర్యాలీ
తమ అభిమాన నేత, టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. చర్లపల్లి కారాగారం నుంచి రేవంత్ విడుదల కాగానే, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ సన్నాహకాలు చేస్తోంది. మరోవైపు, రేవంత్ విడుదలయ్యే సమయానికి చర్లపల్లి జైలు వద్దకు తెలంగాణ వ్యాప్తంగా 25 వేల మంది టీడీపీ కార్యకర్తలు వస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. అనంతరం, 10 వేల మందితో మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ వరకు రేవంత్ ను భారీ ర్యాలీతో తీసుకెళతామని ఆయన అభిమానులు స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.