: చేతులు తెగ్గోసుకొని బాలనేరస్తుల ఆందోళన
తిరుపతిలోని బాలనేరస్తుల శిక్షణాలయంలో కొందరు బాలలు చేతులు తెగ్గోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం కలిగించింది. తమను త్వరగా విడుదల చేయాలని డిమాండు చేస్తూ వారు గాజు పెంకులతో చేతులు కోసుకున్నారు. వివరాల్లోకి వెళితే, తిరుపతి పరిధిలోని మంగళం వద్ద ప్రభుత్వ బాల నేరస్తుల వసతి గృహం ఉంది. ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన బాల నేరస్తులు ఉన్నారు. నిన్న రాత్రి విచారణ నిమిత్తం న్యాయస్థానం బెంచ్ క్లర్క్ వచ్చినప్పుడు, తమను తక్షణం విచారించి విడుదల చేయాలని బాలలు డిమాండ్ చేశారు. కేసులు ఎక్కువగా ఉన్నందున సత్వర విడుదల సాధ్యపడదని క్లర్క్ చెప్పడంతో, వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలను విరగ్గొట్టి భోజనాలను కిందికి నెట్టేశారు. గాజు పెంకులతో చేతులు కోసుకున్నారు. అధికారులు బాలనేరస్తులతో చర్చలు జరిపి వారి విడుదలకు సహకరిస్తామని సర్దిచెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.