: అసలెందుకీ సెక్షన్-8 అమలు?: జేపీ
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకే సెక్షన్-8ను తెరపైకి తీసుకొస్తున్నారని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాష్ నారాయణ్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం విచారణ దశలో ఉన్న ఓటుకు నోటు కేసు, ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులకు, సెక్షన్-8కు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. హైదరాబాదులో గడచిన ఏడాదిగా శాంతిభద్రతలు అదుపు తప్పిన పరిస్థితి లేదని గుర్తు చేశారు. అభద్రతా భావం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిన సందర్భాలు ఏమైనా ఉంటే ప్రజలు చెప్పాలని ఆయన అన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని జేపీ ఆరోపించారు. ఈ సెక్షన్ ను మరోసారి తెరపైకి తేవడం వల్ల కల్లోల వాతావరణం ఏర్పడుతుందని, తాను ప్రధాని, గవర్నర్, కేంద్ర హోం శాఖ మంత్రులకు లేఖను రాశానని ఆయన వివరించారు.