: "మేం వాడాం, మీరూ వాడండి!"... టీమిండియా క్రికెటర్లపై బంగ్లా పత్రిక వ్యంగ్యాస్త్రం
ఇటీవల భారత జట్టుకు బంగ్లాదేశ్ చేతిలో అవమానకర రీతిలో ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్ ను బంగ్లా కుర్రాళ్లు 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. 19 ఏళ్ల యువ లెఫ్టార్మ్ సీమర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ఆ ఓటమి టీమిండియా వ్యూహకర్తలకు మింగుడుపడలేదు. పైకి మామూలుగానే మాట్లాడుతున్నా, ఆటగాళ్లను ఆ ఓటమి ఎంతో వేదనకు గురిచేసింది. ఆ విషయం అటుంచితే... 'ప్రొతోమ్ అలో' అనే బంగ్లా దినపత్రిక టీమిండియాపై వ్యంగ్యాస్త్రం సంధించింది. తన వారపత్రికలో ఓ సెటైరికల్ ప్రకటనను పొందుపరిచింది. ఆ ప్రకటన పైభాగంలో బౌలర్ ముస్తాఫిజూర్ ఓ కట్టర్ ను పట్టుకుని ఉంటాడు. కాస్త కింద, భారత క్రికెటర్లు సగం క్షవరం చేసిన తలలతో ఓ బ్యానర్ పట్టుకుని కనిపిస్తారు. అరగుండ్లు కొట్టించుకున్న రహానే, రోహిత్ శర్మ, కోహ్లీ, ధోనీ, జడేజా, ధావన్, అశ్విన్ కట్టర్ గురించి చెబుతున్నట్టుగా, "మేం వాడాం, మీరూ వాడొచ్చు" అన్న వాక్యాలు బ్యానర్ పై దర్శనమిస్తాయి. ఆ కట్టర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చిరునామా ఇచ్చారు. మిర్పూర్ స్టేడియం మార్కెట్లో లభిస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. వన్డే సిరీస్ లో ముస్తాఫిజూర్ విసిరిన ఆఫ్ కట్టర్లు భారత క్రికెటర్లను ఇబ్బందులపాల్జేశాయన్న దానికి నిదర్శనంగా ఈ ప్రకటన రూపొందించినట్టు అర్థమవుతోంది. అందుకే ప్రకటనలో, ఆ యువ బౌలర్ చేతిలో ఓ కట్టర్ పెట్టారు. ఇది క్రీడాస్ఫూర్తి అనిపించుకోదని క్రికెట్ పండితులు అంటున్నారు. ఇంతలా అవమానకర రీతిలో పత్రికలో సెటైరికల్ యాడ్ వేయడం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యల కారణంగా ఇరు దేశాల మధ్య స్పర్ధ రగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.