: చైనా మార్కెట్లో 'బ్లడ్ బాత్'... మనదీ అదే దారేనా?
చైనా స్టాక్ మార్కెట్ 'బుడగ' పేలింది. గత ఎనిమిది సెషన్లలో 19 శాతం పడిపోయిన షాంగై కాంపోజిట్ ఇండెక్స్ సోమవారం నాడు మరో 4 శాతం దిగజారింది. గత సంవత్సరం జూన్ 19తో పోలిస్తే ఈ సంవత్సరం జూన్ 12 నాటికి 155 శాతం పెరిగి 5,166 పాయింట్లకు ఎగబాకిన షాంగై సూచిక, ఆపై తొమ్మిది సెషన్ల వ్యవధిలో రక్తమోడింది. ఏకంగా 22 శాతం పడిపోయి 4,035 పాయింట్లకు చేరింది. గత ఏడు నెలల వ్యవధిలో చైనా సెంట్రల్ బ్యాంకు నాలుగు సార్లు వడ్డీ రేట్లను తగ్గించడం, మార్కెట్ బుల్ రన్ ముగియడం, గ్రీస్ భయాలు, చైనాలో ఐఐపీ పతనం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడచిన ఏప్రిల్ నెలలో మార్కెట్ బుల్ పై స్వారీ చేయాలని భావించి, ట్రేడింగ్ ఖాతాలను తెరచిన ఎందరో చిన్న ఇన్వెస్టర్లపై ఈ పతనం దెబ్బ పెను ప్రభావాన్ని చూపింది. ఏప్రిల్ లో దాదాపు 44 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభం అయ్యాయి. 16 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు వాటాలను కొన్నారు. ఇప్పుడు వారి కలలన్నీ కల్లలయ్యే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో భారత మార్కెట్ ను పరిశీలిస్తే, 2014లో కొనసాగిన బుల్ రన్ ఆపై ఇన్వెస్టర్లు, ముఖ్యంగా ఎఫ్ఐఐల లాభాల స్వీకరణతో ఆగిపోయింది. ఆల్ టైం రికార్డు స్థాయితో పోలిస్తే 10 శాతం తక్కువగా ఉంది. అయితే, చైనా మార్కెట్ భయాలకు తోడు, గ్రీస్ లో నెలకొన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు మార్కెట్ ను మరింతగా కిందకు దిగజార్చవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. పతన భయాలు ఉన్నప్పటికీ, చైనా సూచికల మాదిరిగా భారీ పతనం అవకాశాలు లేవని అంచనా.