: ప్రేమజంటపై నకిలీ పోలీసుల దాష్టీకం
ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావించిన ఓ ప్రేమ జంట, నకిలీ పోలీసుల దాష్టీకానికి బలైంది. ఓ సైనికోద్యోగీ, మరో ముగ్గురు యువకులు కలసి పోలీసులమంటూ బెదిరించి ప్రియుడిని చితకబాది ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గుంటూరు జిల్లా వేమూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొల్లూరు గ్రామానికి చెందిన మున్నంగి రాజేష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి ఇరువురు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంటి నుంచి పరారై, వేమూరు రైల్వే స్టేషనుకు వచ్చారు. వీరిని గమనించిన నలుగురు దుండగులు, తాము పోలీసులమని చెప్పి అటకాయించారు. వారిలో ఒకడు తాను సైనికుడినని గుర్తింపు కార్డు చూపాడు. యవతిని బలవంతంగా బైకుపై తీసుకెళుతూ, రాజేష్ ను భట్టిప్రోలు పోలీసు స్టేషనుకు రావాలని చెప్పారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన రాజేష్ 100 నంబరుకు కాల్ చేసి విషయం చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలోని పోలాల్లో అత్యాచారానికి గురికాబడ్డ యువతిని గుర్తుపట్టి ఆసుపత్రికి తరలించారు. నిందితులు అడుసుపల్లి వెంకటేశ్వరరావు, రాయంశెట్టి సుధాకర్ లను అరెస్ట్ చేశామని, రత్నం, ఆరిశెట్టి గోపీలు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.