: హమ్మయ్య! బౌలర్లు బతికిపోయారు... వన్డే నిబంధనలను సవరించిన ఐసీసీ


క్రికెట్ పూర్తిగా బ్యాట్స్ మెన్ గేమ్ గా తయారైందని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ వన్డే ఫార్మాట్ నిబంధనలు సవరించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై వన్డేల్లో బ్యాటింగ్ పవర్ ప్లే ఉండదు. కేవలం బౌలింగ్ పవర్ ప్లే మాత్రం అమల్లో ఉంటుంది. అటు, చివరి పది ఓవర్లలో 30 గజాల సర్కిల్ ఆవల ఐదుగురు ఫీల్డర్లను మోహరించడానికి అనుమతినిచ్చింది. ముఖ్యంగా, ఈ నిర్ణయం బౌలర్లకు ఊరట కలిగించేదే. ఇప్పటిదాకా, చివరి ఓవర్లలో బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా బ్యాట్స్ మెన్ నిర్దాక్షిణ్యంగా కొడుతుండడంతో పరుగులు వెల్లువెత్తేవి. సర్కిల్ వెలుపల క్యాచింగ్ పొజిషన్లు తక్కువగా ఉండడంతో బ్యాట్స్ మెన్ బతికిపోయేవారు. ఇటీవల కాలంలో తరచుగా 400 పరుగుల పైచిలుకు స్కోర్లు నమోదవ్వడం సర్కిల్ నిబంధన సరిగాలేని కారణంగానే అని క్రికెట్ పండితులు అంటున్నారు. ఇక, ఫ్రీహిట్ ను ఐసీసీ పునర్నిర్వచించింది. ఏ తరహా నోబాల్ కైనా ఫ్రీహిట్ వర్తిస్తుందని ఐసీసీ పేర్కొంది. ఇప్పటిదాకా, బౌలింగ్ క్రీజు వద్ద పాదం లైను దాటినప్పుడు ప్రకటించే నోబాల్ కే ఫ్రీహిట్ ఇచ్చేవాళ్లు.

  • Loading...

More Telugu News