: బేరమాడితే ‘రేటు’ తగ్గాలిగా!...రేవంత్ బెయిల్ విచారణలో నవ్వులు పూయించిన హైకోర్టు జడ్జీ!
ఓటుకు నోటు కేసు... తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన కేసు. కేసులో కీలక నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్... అప్పటికే పలుమార్లు వాయిదాలు పడటంతో ఈ పిటీషన్ విచారణపై ఇరు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న హైకోర్టులో దీనిపై హోరాహోరీ విచారణ సాగింది. రెండు రాష్ట్రాల ప్రజలు ఊపిరి బిగబట్టి కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. విచారణ జరుగుతున్న కోర్టు హాలు ప్రముఖ న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, ఇరు రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులతో నిండిపోయింది. అయితేనేం, న్యాయమూర్తి జస్టిస్ రాజాఇళంగో మాత్రం నింపాదిగా విచారణ ప్రారంభించారు. అంతేకాదు, సీరియస్ గా సాగుతున్న విచారణలో నవ్వులు పూయించారు. ఉత్కంఠతో విచారణ వింటున్న వారినే కాక వాదప్రతివాదాలతో భీకర దాడులకు పాల్పడిన న్యాయవాదులనూ ఆయన కడుపుబ్బా నవ్వించారు. వివరాల్లోకెళితే... రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నిన్న హైకోర్టులో విచారణ రెండు సార్లు వాయిదా పడింది. ఈ సందర్భంగా జస్టిస్ రాజాఇళంగో ఆసక్తికర వ్యాఖ్య చేశారు ‘‘ముస్లిం సోదరులు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కు వెళతారు. నేను చెన్నై వెళతాను. నేను మధ్యాహ్నం 2.15 తర్వాత కోర్టులో ఉండననే సమాచారం ఏమైనా లీకైందా?’’ అంటూ ఆయన అనడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. ఇక రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తన వాదనలు వినిపిస్తున్న సమయంలో తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కల్పించుకున్నారు. అసలు డబ్బెక్కడి నుంచి వచ్చిందో తేలాల్సి ఉందని ఆయన అన్నారు. దీంతో కల్పించుకున్న జస్టిస్ ఇళంగో, ‘‘డబ్బు రిజర్వ్ బ్యాంకు నుంచే కదా వస్తుంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించి మరోమారు నవ్వులు పూయించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని తన వాదనను వినిపించేందుకు లేచిన ఏజీ రామకృష్ణారెడ్డి... నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ నేతలు తొలుత రూ.2 కోట్లు ఆపర్ చేసి, ఆ తర్వాత సంప్రదింపులు జరిపి రూ.5 కోట్లిస్తామని ఆపర్ చేశారని తెలిపారు. దీంతో మరోమారు జోక్యం చేసుకున్న జస్టిస్ ఇళంగో ‘‘నెగోషియేషన్స్ లో ఆఫర్ చేసిన మొత్తంలో కొంత తగ్గాలి కదా?’’అని వ్యాఖ్యానించడంతో కోర్టు హాలులో మరోమారు నవ్వులు విరిశాయి.