: లలిత్ మోదీపై కేంద్ర మంత్రి సదానంద గౌడ మండిపాటు
ఎక్కడో లండన్ లో ఉంటూ దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా వివాదాలు రేపిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మండిపడ్డారు. గందరగోళం సృష్టించి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి అన్నారు. "లలిత్ ఈరోజు ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల పేర్లను వెల్లడించారు. రేపు కొంతమంది పేర్లు చెప్పవచ్చు. ఎల్లుండి ఈ వార్తలన్నీ ప్రసారం చేస్తున్న వార్తా చానల్ ఓనర్ పేరు చెప్పవచ్చు" అని సదానంద ఎద్దేవా చేశారు. ఇలా అందరినీ గందరగోళంలో పడేసి తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకోవాలని లలిత్ చూస్తున్నాడని ఆరోపించారు. భారీ మొత్తంలో నగదు మింగేసిన లలిత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు.