: ఫాం హౌస్ వద్ద మీడియాకు నో ఎంట్రీ... 2 కి.మీ ఆవలే నిలిపేసిన పోలీసులు!


అల్లం సాగుపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్న మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎరవలిలోని తన ఫాం హౌస్ కు చేరుకున్నారు. నిన్న కూడా ఆయన రోజంతా అక్కడే గడిపారు. అయితే తొలి రోజు ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తి, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ఫాం హౌస్ లో కేసీఆర్ తో కలిసి తిరిగారు. ఈ ఫొటోలు దాదాపుగా అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చాయి. దీంతో కేసీఆర్ పై విపక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తికి ఫాం హౌస్ లో కేసీఆర్ తో ఏం పని? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై కాస్త గుర్రుగా ఉన్న కేసీఆర్, అసలు ఫాం హౌస్ పరిసరాలకు మీడియాను ఎందుకు రానిచ్చారంటూ పోలీసులను ప్రశ్నించారట. సమాధానం చెప్పేందుకు కాస్త ఇబ్బందిపడ్డ పోలీసులు నిన్న మాత్రం మీడియాను అసలు ఫాం హౌస్ దరిదాపులకు కూడా అనుమతించలేదు. ఫాం హౌస్ కు దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలోనే మీడియాను నిలిపేశారు. అంతేకాక ఆ దారిన వెళ్లే ప్రజలను కూడా తనిఖీలు చేసి మరీ పంపారు. ఇక కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన పలు సంఘాల నేతలను కూడా పోలీసులు అల్లంత దూరాన్నే అడ్డుకుని వెనక్కు పంపారు.

  • Loading...

More Telugu News