: పంజాబ్ లో ఇంగ్లీషు టీచర్ల పాండిత్యానికి షాక్ తిన్న మంత్రి!
వారందరూ పంజాబ్ టీచర్ సెలక్షన్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు టీచర్లుగా పనిచేస్తున్నారు. వారిలో అత్యధికులు ఎంఏ ఇంగ్లీషు పట్టాపుచ్చుకున్నవారే! అలాంటి టీచర్ల శిష్యరికంలో విద్యార్థులు ఎంత వికసిస్తారో కదా అని భావించడం సహజం. కానీ, తద్విరుద్ధంగా జరిగింది. ఈ ఏడాది పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ పరీక్షల్లో 80 వేల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లీషు సబ్జెక్టులో ఫెయిలయ్యారట. దీంతో, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి దల్జీత్ చీమా ఇంగ్లీషు టీచర్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. ఆ టీచర్ల భాష, వ్యాకరణ సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఓ సాధారణ పరీక్ష పెట్టారు. తమ విద్యార్థులు ఎందుకు ఫెయిలయ్యారో లిఖిత పూర్వకంగా ఓ ప్రొఫార్మాలో రాయాలని సూచించారు. అయితే, వారి పాండిత్యానికి ఆయన షాక్ తిన్నారు. సాధారణ పదాలకు కూడా స్పెల్లింగులు చెప్పలేక, రాయలేక ఆ టీచర్లలో కొందరు మంత్రిగారి సహనానికి పరీక్ష పెట్టారు. ఆయనతో ఆంగ్లంలో మాట్లాడేందుకు నీళ్లు నమిలారట! వారు రాసిన ఆ ఘనమైన ప్రొఫార్మాలను ఓ ప్రొజెక్టర్ సాయంతో స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి చీమా మాట్లాడుతూ... పంజాబ్ లోని ఇంగ్లీషు టీచర్ల సంస్కరణార్థం కేంబ్రిడ్జ్ వంటి సుప్రసిద్ధ విద్యాసంస్థల సాయం తీసుకునేందుకు నిశ్చయించుకున్నామని తెలిపారు. వారి పాండిత్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన తర్వాత బాధ, దిగ్భ్రాంతి కలిగాయని చెప్పుకొచ్చారు.