: తీవ్రవాదంపై చైనా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోంది: శివసేన
ముంబయిలో 2008 దాడుల ప్రధాన సూత్రదారి జకీర్ రెహ్మాన్ లక్వీని పాకిస్థాన్ విడుదల చేయడంపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో డిమాండ్ చేసిన భారత నిర్ణయాన్ని చైనా అడ్డుకోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. తీవ్రవాదంలో చైనా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తుందని ఆరోపించింది. "ఐరాస శాంక్షన్స్ కమిటీలో ఐదు శాశ్వత, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. వీటిలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు భారత్ నిర్ణయానికి మద్దతిచ్చాయి. కానీ, చైనా వ్యతిరేకించింది" అని సేన పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. ఓ చేత్తో టెర్రరిజాన్ని దారుణంగా అణచివేస్తున్న చైనా, మరో చేత్తో ఇండియాలోకి ప్రవేశిస్తున్న తీవ్రవాద చొరబాటుదారులకు మద్దతు పలుకుతోందని చెప్పుకొచ్చింది. ఇదే చైనా ద్వంద్వ ప్రమాణమని సేన ధ్వజమెత్తింది. ఇటీవల చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ లో 13 మంది ముస్లింలను ఉరి తీశారని, అంతేగాక వందలమంది ముస్లింలను చంపారని చెప్పింది. అయితే తమ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేసి, భారత్ లో టెర్రరిజం కార్యకలాపాలను మరింత వృద్ధి చేయాలన్నట్టు చైనా విధానం ఉందని సేన మండిపడింది.