: ‘దర్బార్’ సమస్యలకు తక్షణ పరిష్కారం... హిందూపురంలో బాలయ్య ప్రకటన
ప్రజా దర్బార్ లో అందిన ఫిర్యాదుల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపనున్నట్లు టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నేటి ఉదయం తన సొంత నియోజకవర్గం హిందూపురం వచ్చిన బాలయ్య, పట్టణంలో ప్రజా దర్బార్ ను నిర్వహించారు. మునిసిపాలిటీకి చెందిన అన్ని విభాగాల అధికారులను రప్పించిన బాలయ్య ఓపికగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ ప్రజా దర్భార్ లో ఇది తొలి అడుగేనని, భవిష్యత్తుల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాను నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందన్నారు. తమ ఫిర్యాదుల్లో ప్రజలు ప్రస్తావించిన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపిస్తానన్నారు. గురువారం హిందూపురం రూరల్ ప్రాంత ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తానని ఆయన ప్రకటించారు.