: బాధితులే దొంగలట... జూబ్లీహిల్స్ చోరీ మిస్టరీ ఛేదించిన పోలీసులు
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో నిన్న జరిగిన చోరీ మిస్టరీని 24 గంటలు గడిచేలోగానే పోలీసులు ఛేదించారు. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసిన రూ.20 లక్షలను గుర్తు తెలియని ఆగంతుకులు దోచుకెళ్లారని రాజేశ్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంపన్నుల నివాసమైన జూబ్లీహిల్స్ లో జరిగిన చోరీ కాబట్టి, పోలీసులు కాస్త వేగంగానే స్పందించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపైనే అనుమానం కలిగింది. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేసేసరికి అసలు విషయం బయటకు వచ్చింది. బ్యాంకు నుంచి డ్రా చేసిన సొమ్మును రాజేశ్, శ్రీనివాస్ లే కాజేసేందుకు కట్టుకథ అల్లారని పోలీసులు తేల్చారు. అనంతరం నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు జీడిమెట్ల వెళ్లి రూ.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.