: అమెరికా పోలీసులకు 'స్టార్ వార్స్' తరహా హోవర్ బైకులు!
1960 ప్రాంతంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసిన వారు ఇప్పుడు నిరుత్సాహంలో వుండి వుంటారు. అప్పుడు తాము చూసినట్టుగా, 50 ఏళ్ల తరువాత స్పేస్ లోకి సులువుగా వెళ్లలేకపోయామని, మాత్రల రూపంలో ఆహారం అభివృద్ధి చెందలేదని, తాము చూసింది నిజం కాలేదని భావిస్తూ ఉండవచ్చు. అటువంటి వారికి ఓ శుభవార్త. అప్పుడు చూసిన గాల్లో ఎగిరే 'హోవర్ బైక్'లు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చాయి. హోవర్ బైకులను తమ పోలీసులకు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం బ్రిటన్ కు చెందిన మెల్లాయ్ ఏరోనాటిక్స్ కంపెనీతో డీల్ కుదుర్చుకుని వాటిని తయారు చేసింది కూడా. ప్రస్తుతం ఈ బైకులను భూమికి తాళ్లతో కట్టి ప్రయోగాత్మకంగా నడిపి చూస్తున్నారు. ఈ బైకులు కూడా డ్రోన్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తాయి. బైకును గాల్లోకి లేపడానికి వీటిల్లో నాలుగు ఫ్యాన్లు వాడారు. మరింత స్థిరత్వం, వేగం కోసం వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఓ చిన్న హెలికాప్టర్ మాదిరిగా పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ బైకులను పరీక్షిస్తున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.