: నేరాల్లేవని పోలీస్ స్టేషన్ ఎత్తేస్తారా?... టీ నేతలపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి ఫైర్
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు వివాదంపై ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య ఆసక్తికర వాదనలు చోటుచేసుకుంటున్నాయి. పునర్విభజన చట్టంలో అంతర్భాగమైన సెక్షన్ 8ను హైదరాబాదులో అమలు చేయాల్సిందేనని ఏపీ సర్కారు పట్టుబడుతుండగా, ఆ అవసరం ఎంతమాత్రం లేదని తెలంగాణ సర్కారు వాదిస్తోంది. నిన్న రోజంతా దీనిపై ఆసక్తికర చర్చ సాగింది. సెక్షన్ 8 ను వ్యతిరేకిస్తున్న తెలంగాణ మంత్రులు ‘‘ఏడాది కాలంలో హైదరాబాదు ప్రశాంతంగా ఉంది. సెక్షన్ 8 అమలు చేయాల్సినంత ఘటనలేమీ నమోదు కాలేదు’’ అంటూ తమ వాదనను కాస్త గట్టిగానే వినిపించారు. ఈ వాదనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓ ఆసక్తికర వాదనను వినిపించారు. ‘‘ఏడాది కాలంలో నేరాలేమీ జరగలేదని పోలీస్ స్టేషన్ నే ఎత్తేస్తారా?’’ అంటూ ఆయన కొత్త ప్రశ్న సంధించారు. దీనికి టీ మంత్రుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి!