: 15వేల నుంచి 5,040 ఎకరాలకు చేరిన భోగాపురం విమానాశ్రయ పరిధి
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ విమానాశ్రయం పరిధి తగ్గింది. మొదట విమానాశ్రయ ఏర్పాటుకు 15వేల ఎకరాలు సేకరించాలనుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు 5,040 ఎకరాల భూమినే సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాలిని అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, 5,040 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భూసేకరణ, భూ సమీకరణలో రైతులు ఏ విధానంలో ముందుకే వస్తే ఆ విధానంలోనే భూమిని తీసుకుంటామని మంత్రి తెలిపారు. భూమి కోల్పోయిన రైతులకు విమానాశ్రయం సమీపంలోనే ప్రభుత్వ భూములు ఇస్తామని హామీ ఇచ్చారు. లేకపోతే రాజధాని పరిహారం కంటే ఎక్కువే ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మృణాలిని చెప్పారు. విమానాశ్రయానికి ఎయిర్ పోర్టు అథారిటీ సాంకేతిక అనుమతి ఇచ్చిందన్నారు.