: రోజుకో ప్రదేశం మారుతూ... ఏసీబీకి మస్కా కొడుతున్న సండ్ర వెంకటవీరయ్య
ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆచూకీ అంతుచిక్కడం లేదు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో ఉన్నానని, పది రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని ఏసీబీ అధికారులకు ఆయన లేఖ రాశారు. ఆస్పత్రికి వచ్చినా విచారణకు సహకరిస్తానని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే తాను ఏ ఆస్పత్రిలో ఉన్నానన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అంతేకాక రోజుకో ప్రదేశం మారుతూ ఆయన ఏసీబీకి మస్కా కొడుతున్నారు. లేఖ రాసే సమయానికి సండ్ర రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే శనివారం మధ్యాహ్నం దాకా సదరు ఆస్పత్రిలో ఉన్న సండ్ర, ఆ తర్వాత అక్కడి నుంచి కూడా అదృశ్యమయ్యారట. ఒకవేళ విచారణ కోసం ఏసీబీ అధికారులు తనను వెతుక్కుంటూ వచ్చినా, వారికి చిక్కకూడదన్న భావనతోనే సండ్ర ఇలా ప్రదేశాలు, ఆస్పత్రులను మారుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.