: "నీది విశాల హృదయం నాన్నా"... అమితాబ్ కు లేఖ రాసిన తనయ
ఇవాళ ఫాదర్స్ డే. మీడియాలో చర్చా కార్యక్రమాలు, సోషల్ మీడియాలో తండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులు... మొత్తమ్మీద ఈ ఆదివారం సందడి నెలకొంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయ శ్వేతా నందా కూడా తండ్రికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలోని ముఖ్యాంశాలు ఇవే... "గతంలో ఎన్నోసార్లు చెప్పినవే మళ్లీ చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు నాన్నా! ఈ లోకంలోకి అడుగుపెట్టిన నన్ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్న కొందరిలో నువ్వూ ఒకడివైనందుకు సంతోషంగా ఉంది. స్నానం చేయించేవాడివి, బట్టలు మార్చేవాడివి, తినిపించేవాడివి... థాంక్యూ నాన్నా! నీ పొడవైన ముక్కు, నీ పొడవైన చేతులు, కాళ్లు నాకు వారసత్వంగా వచ్చినందుకు నాకు ఆనందమే. అయితే, క్లాసులో అందరికంటే నేనే పొడవుగా ఉండడంతో ఎన్ని ఇబ్బందులు పడ్డానో! కొందరు నిర్దాక్షిణ్యంగా విమర్శించేవారు. ఇక, నాకు సంగీతం అంటే ఇష్టం కలగడానికి కారణం నువ్వే నాన్నా! గదిలో కూర్చుని పియానో వాయిస్తుంటే గంటలకొద్దీ అక్కడే ఉండి వినేదాన్ని. ప్రపంచవ్యాప్తంగా నువ్వు సేకరించిన సీడీలను మనం కార్లో వెళుతూ వినేవాళ్లం. ఇవే నాలో సంగీతం పట్ల అనురక్తిని కలిగించాయనుకుంటా. అన్ని రకాల సంగీతాలను ఆస్వాదించే అభిరుచి అప్పటి నుంచే నాలో మొదలైంది. నీది విశాల హృదయం. మృదువైన చేతులతో, ఆప్యాయంగా హత్తుకునేవాడివి. ఏ కూతురైనా కోరుకునే అత్యుత్తమ జీవితాన్ని నాకందించావు నాన్నా... అందుకు కృతజ్ఞతలు!"... అంటూ లేఖను ముగించింది.