: నేడే అంతర్జాతీయ యోగా దినోత్సవం...192 దేశాల్లో వేడుకలు
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని 192 దేశాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సనాతన భారతీయ సంప్రదాయ పద్ధతైన యోగాకు ఇన్నాళ్టికి సరైన గుర్తింపు లభించింది. యోగా డే సందర్భంగా ఢిల్లీలోని రాజ్ పథ్ లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. రాజ్ పథ్ ను యోగా వేడుకలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో ప్రధాని, కేంద్ర మంత్రులు, ప్రముఖులు సహా సుమారు 40 వేల మంది యోగాసనాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, యోగా దినోత్సవంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజ్ పథ్ లో నిర్వహించే యోగాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసేందుకు ఆయుష్ అధికారులు సన్నాహాలు చేశారు. ఈ ప్రదేశంలో యోగా చేసేందుకు 37 వేల చాపలను పరిచారు. 2000 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 152 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించారు. విదేశాల్లోని భారతీయులు కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అమెరికాలోని న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ వద్ద 30,000 మందితో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేయనున్నారు. యోగాను ఆచరించే పలు సంస్థలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 7:35 నిమిషాల వరకు యోగాను అధికారికంగా ఆచరించనున్నారు. రాజ్ పథ్ లో మాత్రం రోజంతా కార్యక్రమాలు జరగనున్నాయి. యోగా దినోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. యోగా ద్వారా మానసిక ఆందోళన తగ్గించుకోవచ్చని, పలు రోగాలకు యోగా నివారిణిగా పని చేస్తుందని, యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాతన భారత గ్రంధాలు తెలియజేస్తున్నాయి. మానసిక సంతులత కావాలంటే యోగాను ఆచరించాలని భారతీయ గ్రంధాలు చెబుతున్నాయి. యోగా ద్వారా భారత్ ప్రపంచానికి మార్గదర్శకం వహించనున్నది. యోగాను ఆచరించేందుకు ప్రపంచదేశాల అధినేతలు ఆసక్తి చూపించడం విశేషం.