: 'టీ న్యూస్' సమాధానం చెప్పలేదా? నోటీసులివ్వడం తప్పా?: ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె
'టీ న్యూస్'కు నోటీసులివ్వడం ఎందుకు తప్పో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, చట్ట ప్రకారమే విశాఖ పోలీసులు టీ న్యూస్ కు నోటీసులిచ్చారని ఆయన తెలిపారు. టీన్యూస్ కు నోటీసులివ్వడంపై ఎందుకు ఆందోళన చెందుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. 'నోటీసులపై టీన్యూస్ వివరణ ఇవ్వలేదా?' అని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు తామెవరికీ ఆడియో టేపులు ఇవ్వలేదని స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు టీ న్యూస్ కు ఆ ఆడియో టేపులు ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు? టెలీకాస్ట్ చేయమని ఎవరు ఆదేశించారు? అని ఆయన ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దిగజార్చే టేపులు ప్రసారం చేసినప్పుడు, నిజానిజాలు వెల్లడించగలగాలని ఆయన సూచించారు. నోటీసులివ్వడం తప్పుకాదని, అది మీడియా స్వేచ్ఛను ఉల్లంఘించడం కాదని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన వివాదాలు రేపొద్దని, మీడియా స్వేచ్ఛ గురించి తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.