: సౌదీని టార్గెట్ చేసిన వికీలీక్స్... కొత్త కేబుల్స్ లీక్ తో ఉలిక్కి పడిన ప్రపంచం
ఇంతకాలం మౌనంగా ఉన్న వికీలీక్స్ మళ్లీ పంజా విసిరింది. తాజాగా వికీలీక్స్ విడుదల చేసిన 61 వేల కేబుల్స్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ కేబుల్స్ కు 'సౌదీ కేబుల్స్' అని పేరు పెట్టారు. ఈ కేబుల్స్ సౌదీ విదేశాంగ శాఖకు చెందినవి కావడంతో... ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు గల దేశాలన్నీ తాము ఎక్కడ ఇబ్బంది పడతామో అని భయపడుతున్నాయి. ఈ కేబుల్స్ సౌదీ ప్రభుత్వ అరాచకాలను బయటపెట్టాయి. ఈ సందర్భంగా వికీలీక్స్ అధినేత అసాంజే మాట్లాడుతూ, సౌదీ ప్రభుత్వం చేస్తున్న ఘాతుకాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన 100 మందిని శిరచ్ఛేదం చేసి, ఆ ఘటనను సెలబ్రేట్ చేసుకుందని చెప్పారు. సౌదీలో పాలన కూడా అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికి 61 వేల కేబుల్స్ ను రిలీజ్ చేసినా... రానున్న రోజుల్లో సౌదీకి చెందిన మరో 50 లక్షల రహస్య పత్రాలను విడుదల చేస్తామని అసాంజే ప్రకటించారు. ఈ కేబుల్స్ లో ఏముందో అని చాలా దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న సౌదీ విద్యార్థులపై ఆ దేశం నిఘా ఉంచుతోందని విమర్శించారు. తమకు అనుకూలంగా పని చేస్తున్న అరబిక్ ప్రచార సాధనాలకు భారీ ఎత్తున డాలర్లను చెల్లిస్తోందని చెప్పారు.