: డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే చెల్లింపులు, ఎలాగంటే...!
డెబిట్, క్రెడిట్ కార్డుల అక్రమాలు పెరిగిపోయాయని భావిస్తున్నారా? వాటిని వాడాలంటే భయపడుతున్నారా? మీ కోసం కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఏ విధమైన కార్డులు వాడకుండానే ఆన్ లైన్లో నగదు చెల్లింపులు జరుపుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా? అదేం విధానమో తెలుసుకోవాలని వుందా? ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది 'పేటీఎం'. ఇదో మొబైల్ వాలెట్ వంటిది. దేశవ్యాప్తంగా ఇప్పుడు 5 వేలకు పైగా పేటీఎం ఔట్ లెట్లు ఉన్నాయి. వీటిల్లోకి వెళ్లి నగదు డిపాజిట్ చేస్తే, ఆ వ్యక్తి పేటీఎం ఖాతాలోకి ఆ డబ్బు చేరుతుంది. దీన్ని వాడుతూ సులువుగా, సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. "ఉదాహరణకు మీరు ఏదైనా యాక్సిస్ బ్యాంకు శాఖకు వెళ్లి మీ పేటీఎం ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో పేటీఎం ఔట్ లెట్ల సంఖ్యను 50 వేల నుంచి 75 వేలకు పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నాం" అని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమిత్ లోకహిత చెబుతున్నారు. ప్రస్తుతం తాము 8 కోట్ల మంది యూజర్లకు సేవలందిస్తున్నామని, నెలకు 7.5 కోట్ల వరకూ లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బుక్ మైషో, మేక్ మై ట్రిప్, ఉబెర్, ట్యాక్సీ ఫర్ ష్యూర్ వంటి 15 వేల వరకూ వ్యాపార సంస్థలు, వెబ్ సైట్లు పేటీఎం చెల్లింపులను అంగీకరిస్తున్నాయని వివరించారు. సంప్రదాయ ఆన్ లైన్ బ్యాంకింగ్ విధానంతో పోలిస్తే సులువుగా లావాదేవీలు పూర్తవుతాయని అమిత్ చెప్పారు. ఈ లావాదేవీల్లో ఖాతాదారుడి నుంచి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని, వ్యాపారి నుంచే తమ వాటాగా కొంత కమిషన్ అందుతుందని, ప్రస్తుతం సంస్థ వార్షికాదాయం 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,600 కోట్లు)కు చేరిందని వివరించారు.