: 128 జీబీ మెమొరీ, 4 జీబీ రామ్ తో మార్కెట్లోకి కొత్త ఫోన్!
4 జీబీ రామ్ తో ఆసుస్ సంస్థ 'జెన్ ఫోన్ 2'ను త్వరలో విడుదల చేయనుందని, ఈ ఫోన్లో 128 గిగాబైట్ల మెమరీ ఉంటుందని గడచిన ఏప్రిల్ లో ఇ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రకటన వెలువడినప్పుడు టెక్ ప్రియులు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు తెగ సంబరపడిపోయారు. ఇంత అధిక సామర్థ్యంతో లభించే తొలి ఫోన్ ఇదే కావడం, ధర కూడా హైఎండ్ ఫోన్లతో పోలిస్తే తక్కువగా (సుమారు రూ. 24,900) ఉండడంతో ఈ ఫోన్ పై ఆసక్తి పెరిగింది. ఈ జెన్ ఫోన్ 2 నేడు తైవాన్ మార్కెట్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఆపై మరో నెల రోజుల వ్యవధిలో భారత మార్కెట్లోకీ వస్తుంది. ఇండియన్ మార్కెట్ కోసం 32 జీబీ, 64 జీబీ వర్షన్లనూ ఆసూస్ విడుదల చేయనుంది. గూగుల్ ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే స్మార్ట్ ఫోన్లో 2.3 జిహెచ్ క్వాడ్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 13 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ తదితర సదుపాయాలుంటాయి. 4 జిబి రామ్ ఈ ఫోన్ కు పెద్ద ప్లస్ పాయింటని, అద్భుత గేమింగ్ అనుభూతిని పొందవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.