: బీ కేర్ ఫుల్... 'సాక్షి' జర్నలిస్టుకు సీఎం రమేష్ వార్నింగ్
'ఓటుకు నోటు' కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు తన ఖాతా నుంచే డ్రా చేసినట్టు సాక్షి మీడియాలో వస్తున్న వరుస కథనాలపై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో పలు చానల్స్ తో రమేష్ ఈరోజు మాట్లాడారు. ఆ సమయంలో 'మీ ఖాతా నుంచే యాభై లక్షలు డ్రా అయ్యాయని అంటున్నారు కదా సార్?' అని సాక్షి జర్నలిస్ట్ ప్రశ్నించాడు. అందుకు మండిపడ్డ రమేష్, తన ఖాతా నుంచే రూ.50 లక్షలు డ్రా అయ్యాయని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే జగన్ రాజీనామా చేస్తాడా? అని ఆవేశంతో అడిగారు. జగన్ ఎందుకు రాజీనామా చేస్తారని అటు నుంచి సాక్షి జర్నలిస్ట్ అన్నాడు. దాంతో కోపోద్రిక్తుడైన రమేష్.... లేకుంటే మీ సాక్షి చానల్ మూసుకుంటారా? అని ప్రశ్నించారు. బుద్ధి లేకుండా వార్తలు వేస్తున్నారని, నువ్వే మీ చానల్ లో ఆ కథనాలు వేశావని అన్నారు. ఈ క్రమంలో ఎంపీకు, సాక్షి జర్నలిస్ట్ కు మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. చివరగా 'బీ కేర్ ఫుల్' అంటూ సదరు జర్నలిస్ట్ కు ఎంపీ రమేష్ వార్నింగ్ ఇచ్చారు.