: ల్యాండ్ ఫోన్లకు మళ్లీ గిరాకీ వస్తోంది!
ల్యాండ్ లైన్ ఫోన్... ఓ పుష్కర కాలం క్రితం వరకూ లగ్జరీ సూచికగా భావించిన వస్తువు. సెల్ ఫోన్ల పుణ్యమాని ల్యాండ్ లైన్ ఫోన్లు పూర్తిగా మరుగునపడిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తిరిగి ల్యాండ్ ఫోన్లకు గిరాకీ పెరుగుతోంది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు తమ ఇంట ఓ ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మే 1 నుంచి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ కనెక్షన్ తో రాత్రిపూట అపరిమిత ఉచిత కాల్స్ సదుపాయం కల్పించిన తరువాత కొత్త కనెక్షన్లు కావాలని దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గడచిన రెండు నెలల్లో కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న అప్లికేషన్ల సంఖ్య 30 శాతం పెరిగినట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించక నిలిపివేసిన కనెక్షన్లు, తాత్కాలికంగా తొలగించిన కనెక్షన్లను పునరుద్ధరించాలన్న దరఖాస్తులూ అధికంగా వస్తున్నాయని వివరించారు. కాగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకూ దేశవ్యాప్తంగా ఏ నెంబరుకు కాల్ చేసి ఎంత సేపు మాట్లాడుకున్నా ఎటువంటి బిల్లూ చెల్లించక్కర్లేదు. ఈ ఆఫర్ అపరిమితంగా ఆకర్షిస్తుండడంతో కనెక్షన్ల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.