: స్టీఫెన్ వాంగ్మూలం తీసుకోలేదు... ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు... మరి, చంద్రబాబుకు నోటీసులు ఎలా ఇస్తారు?: జూపూడి


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతూ దేశ, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు ఇవ్వనుందన్న వార్తలపై ఆయన మండిపడ్డారు. ఏసీబీకి ఆ అధికారం లేదని కొట్టిపారేశారు. ఇంతవరకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం తీసుకోలేదని... అలాగే, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాలేదని... ఈ నేపథ్యంలో, చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఏసీబీ ఇదే ధోరణితో ముందుకెళితే, దాన్ని కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఇదే సమయంలో, గవర్నర్ నరసింహన్ పై జూపూడి ఫైర్ అయ్యారు. సెక్షన్-8 ఏంటనేది విభజన చట్టంలో క్లియర్ గా ఉందని... నిన్న గవర్నర్ తో భేటీ అయినప్పుడు సెక్షన్, గిక్షన్ జాన్తా నై అని కేసీఆర్ అంటే... నరసింహన్ ఇంతవరకు మౌనంగా ఎలా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెక్షన్ ను సంరక్షించాల్సిన వ్యక్తి మౌనముద్ర దాల్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సెక్షన్-8 చెల్లదని చెప్పడానికి కేసీఆర్ ఏమైనా సుప్రీంకోర్టా? లేక హైకోర్టా? అని నిలదీశారు. కేసీఆర్ లాంటి వాళ్లను ఎంతో మందిని చూశామని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News