: సెక్షన్ గిక్షన్ జాన్తా నై... నరసింహన్ కు తేల్చిచెప్పిన కేసీఆర్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు కుదరదని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ మేరకు నిన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సుదీర్ఘ భేటీ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సందర్భంగా కంటితుడుపు చర్యగానే దీనిని కేంద్రం విభజన చట్టంలో ప్రస్తావించిందని చెప్పిన కేసీఆర్, హైదరాబాదుపై సంపూర్ణ అధికారం తమదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం మొండిగా ముందుకెళ్లాలని చూస్తే దీటుగానే ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన కేసీఆర్, కోర్టుల్లోనూ ఈ సెక్షన్ నిలబడదని సూత్రీకరించారు. ఓటుకు నోటు కేసు దోషులను తప్పించేందుకే ఈ సెక్షన్ ను తెరపైకి తెస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్న ఈ సెక్షన్ అమలును అడ్డుకుని తీరతామని ఆయన గవర్నర్ కు తేల్చిచెప్పారు.