: ఇందిరాపార్కులో రఘు'వీరా'వేశం!
ఓటుకు నోటు వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఉదయం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, మొత్తం వ్యవహారంలో నిందితులెవరో తేల్చాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని అన్నారు. గడచిన సంవత్సరం వ్యవధిలో బిగ్ బాస్ కు, స్మాల్ బాస్ కు రూ. 4 వేల కోట్ల ముడుపులు అందాయని ఆవేశంగా అన్నారు. చంద్రబాబునాయుడికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని దుయ్యబట్టారు. గతవారం ఆయన ఢిల్లీ వెళితే, సీబీఐ విచారణ కోరేందుకు వెళ్లారని భావించామని, కానీ బాబు మాత్రం ప్రధాని, హోం మంత్రి, ఇతర మంత్రులను కలిసి వెంకన్న ప్రసాదాలు పంచి వచ్చారని, తనను గట్టున పడవేయాలని వేడుకున్నారని అన్నారు. మోడీ కాళ్లదగ్గర తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన బాబు తక్షణం తన తప్పు ఒప్పుకుని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.