: బాలయ్యకు సీఎం అయ్యే అర్హతలన్నీ ఉన్నాయి... ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్య


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీఎం అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇదే భావనతో ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు వ్యవహారంపై కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో స్పందించిన రామనారాయణరెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో తలదూర్చారని ఆరోపించారు. కేసులో నిండా మునిగిపోయిన చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా చంద్రబాబు వెనుకాడటం లేదని ధ్వజమెత్తారు. కేసులో అరెస్టైతే, తమకు చంద్రబాబు దారిద్ర్యం పోతుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారన్నారు. అదే సమయంలో చంద్రబాబు స్థానంలో తమ అభిమాన నటుడి తనయుడు బాలయ్య తమకు సీఎం అవుతారన్న సంతోషం కూడా వారిలో వ్యక్తమవుతుందని ఆనం చెప్పారు.

  • Loading...

More Telugu News