: భారీ విస్తరణ... 11 కొత్త కంపెనీలు ప్రారంభించనున్న అనిల్ అంబానీ
భారత రక్షణ రంగంలో వ్యాపారావకాశాలను వెతుకుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ గ్రూపు, 11 కొత్త కంపెనీలను ప్రారంభించనుంది. ఇందుకోసం అవసరమైన అనుమతులు ఇవ్వాలంటూ, కేంద్రానికి దరఖాస్తులు పంపింది. సైన్యానికి అవసరమయ్యే ఆయుధాల తయారీ, వాటి అభివృద్ధి, డిజైన్ తదితరాల కోసం ఈ కంపెనీలను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఇవి ఉంటాయి. ఒక్కో సంస్థ కనీసం రూ. 10 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పనిచేస్తాయని సమాచారం. విదేశీ ఆయుధ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుని ఇండియాలో సేవలందిస్తాయని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు విదేశాలకు ఆయుధాల ఎగుమతి అంశాన్ని కూడా పరిశీలించాలని అనిల్ అంబానీ భావిస్తున్నారు. స్వదేశీ హెలికాప్టర్ల తయారీ, మానవ రహిత విమానాలు, సిములేటర్లు, యుద్ధ వాహనాల తయారీ, సబ్ మెరైన్లకు అవసరమయ్యే సాంకేతికత, వాయు, నౌకాదళాల్లో వాడే పరికరాలకు విడిభాగాలు, విమానాలు, నౌకల నిర్వహణ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, మిసైల్స్ డిజైన్ మరియు తయారీ, రాత్రిపూట స్పష్టంగా చూపే వివిధ రకాల ప్రొడక్టుల తయారీ కోసం ఈ కంపెనీలు పనిచేయనున్నాయి.