: ట్యాపింగ్ పై ఏపీ సిట్?... తెలంగాణ సర్కారుపై ఎదురు దాడికి సన్నాహాలు
ఓటుకు నోటు కేసులో టీ టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి షాకిచ్చింది. అయితే ఇదే కేసులో తెలంగాణ సర్కారును ఇరుకునపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నిన్న డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధలతో భేటీ అయిన చంద్రబాబు పలు కీలకాంశాలపై సమీక్షించారు. ప్రధానంగా తన ఫోన్ తో పాటు తన చుట్టూ ఉన్న దాదాపు 120 మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. దీంతో ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులన్నింటినీ దర్యాప్తు చేసేందుకు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు నిన్నటి పోలీసు బాసులతో భేటీలో భాగంగా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి పోలీసు బాసులు కూడా ఓకే అనడంతో రేపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.