: ‘చంద్రు’లూ విద్వేషాలు వీడి, కలిసి యోగా చేయండి: బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ మంచి సలహా ఇచ్చారు. విద్వేషాలను పక్కనబెట్టి సీఎంలిద్దరూ ఈ నెల 21న కలిసి యోగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించిన ఆయన, ఈ కేసులో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి చేసింది తప్పోె, ఒప్పో తేలిన తర్వాతే ఆ పార్టీతో పొత్తు విషయంపై యోచిస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘ఇద్దరు సీఎంలు విద్వేషాలు వీడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటుకు నోటు కేసులో వీరిద్దరికి మానసిక ప్రశాంతత కరవైంది. ఈనెల 21న జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇద్దరు సీఎంలు పక్కపక్కనే కూర్చుని యోగా సాధన చేయాలి" అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో రాజకీయ నేతలు, మంత్రులు వాడుతున్న భాష మంచిది కాదని, కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.