: ఎయిర్ ఇండియా భోజనంలో బల్లి!
ఎయిర్ ఇండియా మరో వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీ నుంచి లండన్ వెళుతున్న విమానంలో ప్రయాణికులకు ఇచ్చిన భోజనంలో బల్లి కనిపించింది. ఈ ఘటనపై సదరు ప్రయాణికుడు ఏఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి ఒంటి గంటకు లండన్ బయలుదేరిన 'ఏఐ 111'లో ఈ ఘటన జరిగింది. విమానం బయలుదేరగానే ప్రయాణికులకు ఇచ్చిన మీల్స్ ట్రేలో బల్లి కనిపించినట్టు సమాచారం. దీన్ని ఆ ప్రయాణికుడు ఫోటో కూడా తీశాడు. తొలుత క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వారు మరో భోజనం ఇస్తామని ఆఫర్ చేసినా, ఆయన తిరస్కరించాడు. ఆపై విమానం దిగిన తరువాత అధికారులకు కంప్లయింట్ ఇచ్చాడు. కాగా, ఈ ఆరోపణలు నిరాధారమని ఏఐ అధికారి ఒకరు కొట్టిపారేశారు. తమకు ఏ ఫిర్యాదూ అందలేదని అంటున్నారు.