: అప్పుడు మాట్లాడని పాక్ ఇప్పుడెందుకు మాట్లాడుతోంది?: శివసేన
భారత్ పై పాకిస్థాన్ ధ్వజమెత్తడం పట్ల శివసేన పార్టీ ఘాటుగా స్పందించింది. మయన్మార్ భూభాగంలోకి వెళ్లి భారత దళాలు తీవ్రవాదులపై దాడి చేయడంపై పాక్ చేస్తున్న ఆక్షేపణలను తప్పుబట్టింది. పొరుగు దేశానికి బుద్ధి చెబుతామంటూ రంకెలు వేయడం సరికాదని హితవు పలికింది. పాక్ కు అలాంటి వ్యాఖ్యలు చేసే అర్హత లేదని స్పష్టం చేసింది. అమెరికా దళాలు పాక్ లో ప్రవేశించి ఒసామా బిన్ లాడెన్ ను చంపినప్పుడు మౌనం వహించారని గుర్తు చేసింది. పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఈ మేరకు విమర్శనాస్త్రాలు సంధించింది. భారత్ ను ప్రశ్నించే ముందు, 2011లో అమెరికా దళాలు దేశంలోకి ప్రవేశించి లాడెన్ ను హతమార్చినప్పుడు ఆ విషయంపై ఎలుగెత్తేందుకు ఎందుకు ధైర్యం చేయలేకపోయిందో పాకిస్థాన్ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొంది. "అమెరికా సైనికులు లాడెన్ ను చంపి కళేబరాన్ని కూడా ఎత్తుకెళ్లారు. దీనిపై పాక్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోయిందో వివరించాలని" అని పేర్కొంది. మయన్మార్ ఘటనతో పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి, భారత్ ను హెచ్చరిస్తోందని విమర్శించింది.