: నిఘా నీడలో నైమిశ నిశ్చితార్థం... ఎన్ కన్వెన్షన్ లో ఏర్పాట్లు పూర్తి
టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్థ వేడుక నేడు హైదరాబాదు, మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరగనుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వేడుక కోసం జూబ్లీహిల్స్ నుంచి రేవంత్ కుటుంబ సభ్యులతో పాటు వరుడి కుటుంబం కూడా మరికాసేపట్లో అక్కడికి చేరుకోనుంంది. ఈ శుభకార్యానికి రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరునున్నారు. షరతులతో కూడిన బెయిల్ తో రేవంత్ రెడ్డి ఈ వేడుకకు హాజరవుతున్నారు. కూతురు నిశ్చితార్థం నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, బెయిల్ పై బయట ఉన్న సమయంలో ఏ వ్యక్తితో ప్రత్యేకంగా భేటీ కావడం కాని, ఫోన్ లో సంభాషించడం కానీ చేయరాదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రేవంత్ పై గట్టి నిఘా వేయాలని కూడా ఏసీబీ అధికారులకు సూచించింది దీంతో ఆయనపై నిఘా కోసం ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సివిల్ డ్రెస్సుల్లో ఏసీబీ అధికారులు ఎన్ కన్వెన్షన్ కు చేరుకోనున్నారు. దీంతో నైమిశ నిశ్చితార్థం సాంతం నిఘా నీడలోనే జరగనుంది.