: ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు నాతో చర్చించారు: వెంకయ్యనాయుడు
ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన విషయాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియాకు వెల్లడించారు. స్మార్ట్ సిటీ ప్రారంభించే 'అమృత్ పథకం'పై చర్చించామని, కేంద్రం ఆమోదం తెలపాల్సిన వివిధ అంశాలను చంద్రబాబు తన దృష్టికి తెచ్చారని వివరించారు. అంతేగాక రాష్ట్రంలో ఆయుర్వేద పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారన్నారు. దానిని కృష్ణాజిల్లా అగిరిపల్లిని ఎంపిక చేసుకున్నట్లు చెప్పిన వెంకయ్య, త్వరలో కేంద్ర బృందం పర్యటిస్తుందని పేర్కొన్నారు. తరువాత తదుపరి కార్యాచరణ మొదలవుతుందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే, ఎయిమ్స్ పథకాలపైనా చర్చించామని వెంకయ్య చెప్పారు. కేంద్రం తప్పకుండా ఏపీని ఆదుకుంటుందని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చామని ఉద్ఘాటించారు.