: బెయిల్ తప్పక వస్తుందిలే... బంధువులతో రేవంత్ రెడ్డి భార్య గీత
ఓటుకు నోటు కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డికి తప్పక బెయిల్ లభిస్తుందని ఆయన సతీమణి గీత భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె తన బంధువుల వద్ద ప్రస్తావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం రేపు జరగనుంది. నిశ్చితార్థం తేదీ ఖరారైన తర్వాత రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. మరోమారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ విచారణను నేటికి వాయిదా వేస్తూ కోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తొలుత కాస్త ధైర్యంగానే ఉన్న రేవంత్ రెడ్డి భార్య గీత, నిశ్చితార్థం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా నిన్న ఆమె తన బంధువర్గంతో మాట్లాడుతూ నిశ్చితార్థంలోగా రేవంత్ కు బెయిల్ లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారట. తన భర్తపై ప్రభుత్వానికి ఎంత కక్ష ఉన్నా, కుమార్తె నిశ్చితార్థానికి బెయిల్ రాకుండా అడ్డుకునే యత్నాలు చేయడాన్ని తాను ఊహించలేనని కూడా ఆమె వ్యాఖ్యానించారట. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ బెయిల్ పిటీషన్ పై జరగనున్న విచారణ కోసం గీతతో పాటు ఆమె బంధువులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.