: బాబుకు తప్పించుకునే అవకాశం ఇవ్వొద్దు... జైల్లో పెట్టాలి: జగన్
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన అనంతరం జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు తప్పించుకునే అవకాశం ఇవ్వరాదని, నీచ రాజకీయాలకు పాల్పడే అలాంటి వ్యక్తి జైల్లో ఉంటేనే రాష్ట్రం బాగు పడుతుందని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియోలో దొరికిపోయాడని, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఎర వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని వదిలిపెడతారా?... సామాన్యుడికి ఓ న్యాయం, సీఎంకు ఓ న్యాయమా? అని ప్రశ్నించారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1 నిందితుడిగా చేర్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఏపీలో లంచాల రూపంలో స్వీకరించిన సొమ్మునే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు లంచంగా ఇవ్వజూపారని జగన్ దుయ్యబట్టారు. "లంచం ఇచ్చింది నీ ఎమ్మెల్యే, ఇవ్వమని చెప్పింది నువ్వు, ఫోన్ లో నామినేటెడ్ ఎమ్మెల్యేతో మాట్లాడింది నువ్వు... మరి నన్నెందుకు ఈ విషయంలోకి లాగుతారు?" అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయి ఏడాది అయిందని, తామెవరితో కలిస్తే ఏంటని, బాబుకు వచ్చే నష్టమేంటని నిలదీశారు. తెలుగు ప్రజలు కలిసి ఉండాలన్నదే తమ అభిమతమని జగన్ స్పష్టం చేశారు.