: 95 శాతం మందికి ఏదో ఒక రోగం, 230 కోట్ల మందికి కనీసం 5 ఆరోగ్య సమస్యలు
ప్రపంచ ప్రజల్లో 95 శాతం మంది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారని, మూడింట ఒకవంతు ప్రజలను కనీసం ఐదు ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. 'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్' పేరిట నిర్వహించిన అధ్యయనం వివరాలను ప్రతిష్ఠాత్మక జర్నల్ 'ది లాన్సెట్' ప్రచురించింది. ఇందులోని వివరాల ప్రకారం ప్రతి 20 మందిలో కేవలం ఒకరికి మాత్రమే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. సుమారు 230 కోట్ల మంది ప్రజలు ఐదు రోగాలతో బాధ పడుతున్నారు. 1990లో అనారోగ్యం కారణంగా నష్టపోతున్న సరాసరి జీవితకాలం 21 శాతంగా ఉండగా, అది 2013 నాటికి 31 శాతానికి పెరిగిందని వెల్లడించింది. 2013లో అన్ని దేశాల ప్రజలనూ పట్టి పీడిస్తున్న టాప్-10 రోగాల్లో 'లో బ్యాక్ పెయిన్'తో పాటు పని ఒత్తిడి, మధుమేహం, ఆస్తమా వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, ఐరన్ లోపం, మెడనొప్పి, వృద్ధాప్య సంబంధిత రోగాలు ఉన్నాయని వివరించింది. అయితే, అందుబాటులోకి వచ్చిన అధునాతన వైద్యం కారణంగా రోగాలు పెరుగుతున్న స్థాయిలో మరణాలు పెరగడం లేదని అధ్యయనం తేల్చింది. ఉదాహరణకు గడచిన 23 సంవత్సరాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 43 శాతం పెరిగితే, దీని కారణంగా మరణించిన వారి సంఖ్య 9 శాతమే పెరిగిందని అధ్యయనం నిర్వహించిన టీముకు హెడ్ గా ఉన్న యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ థియో వోస్ తెలిపారు. పెరుగుతున్న వయసు కొద్దీ చుట్టుముడుతున్న రోగాల సంఖ్యా పెరుగుతోందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నాలుగేళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో 36 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవని, 80 ఏళ్లు దాటిన వారిలో ఈ సంఖ్య కేవలం 0.03 శాతమని తెలిపారు. 1990 నుంచి 2013 మధ్య కాలంలో పది రోగాలు అంతకన్నా ఎక్కువ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 52 శాతం పెరిగిందని వోస్ వివరించారు.