: ఎవరు చెప్పారు మీకు, టీ చానల్ లో వేయమని?... ఒక్కో అస్త్రం బయటికి తీస్తా : చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన మహా సంకల్ప సభలో రౌద్రరూపం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "మంచిగా ఉంటే మంచిగా ఉంటా, చెడు తలపెడితే మాత్రం, ఖబడ్దార్... వదిలిపెట్టేది లేదు. రాష్ట్రాల మధ్య తగాదాలు చాలా దూరం వెళతాయి. నేను కళ్లు తెరిస్తే కేసీఆర్ కు కష్టాలు తప్పవు. వాళ్లు ఆ విషయం గ్రహించాలి. మనం నవనిర్మాణ దీక్ష పెట్టుకుంటే, దాన్ని చెడగొట్టేందుకు కుట్ర పన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో... ఏసీబీ వాళ్లు దాడులు చేస్తారు, క్యాసెట్ ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తాడు. ఇక, నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్ తయారుచేస్తారు... దాన్ని టీ చానల్ లో వేస్తారు. ఎవరు చెప్పారు టీ చానల్ లో వేయమని? ఇదేమన్నా మీ జాగీరా? ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే అధికారం ఉంది. మనం ఫోన్ లో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, అలాంటిది ఫోన్ ట్యాప్ చేస్తే ఎంత కడుపు మండిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాన్ని తేలిగ్గా వదిలిపెట్టను. సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం బయటపెడతా" అని ప్రసంగించారు. అంతకుముందు, కొందరు టీడీపీ అవుట్ అన్నారని... ఆ మరుక్షణమే ఏం జరిగిందో వారికి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. మనతో పెట్టుకుంటే ఎవరైనా తలొంచాల్సిందేనని, ఎన్టీఆర్ తో పెట్టుకున్న ఇందిరాగాంధీ అంతటి వ్యక్తే తలొంచిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ఎవరిముందు తలొంచలేదని, ఇది చరిత్ర అని గట్టిగా చెప్పారు. కాగా, తనను అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లివచ్చిన నేతలు కూడా ప్రశ్నిస్తున్నారని, ప్రజాస్వామ్యం కాబట్టి సమాధానం చెబుతున్నానని అన్నారు. వారి కుట్ర రాజకీయాలు ఎన్నటికీ సాగవని స్పష్టం చేశారు. ఇక, తన ప్రసంగాన్ని ముగిస్తూ సభికులతో మహా సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు.

  • Loading...

More Telugu News