: ఇదేం దూకుడు... ఆడియో టేపుల విడుదలపై తెలంగాణ అధికారుల విస్మయం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును ఇబ్బంది పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారా? అవుననే అంటున్నాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వర్గం అధికారులు. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలుగా భావిస్తున్న ఆడియో టేపులను న్యాయస్థానం అనుమతి లేకుండా ఎలా బయటపెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ పెద్దల ఆదేశాలకనుగుణంగా నడుచుకుంటున్న ఇంటెలిజెన్స్ బాసులపైనా సదరు వర్గం అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు ఈ తరహా వ్యవహారాల్లో ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే ముందుకెళుతున్నారని చెబుతున్నారు. ఈ తరహా దూకుడుపై న్యాయస్థానాల మొట్టికాయలు పడటమే కాక కేసు నీరుగారిపోయే ప్రమాదం లేకపోలేదని కూడా ఆ వర్గం అధికారులు వాదిస్తున్నారు.