: ఆర్తీ అగర్వాల్ మరణానికి కారణం ఇదే!
ప్రవాస భారతీయురాలిగా భారత చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆర్తీ అగర్వాల్ మరణానికి కారణం లైపోసక్షన్ ట్రీట్ మెంట్ అని సమాచారం. 'పాగల్ పన్' సినిమాతో హిందీలో 2001లో అడుగుపెట్టిన ఆర్తీ అగర్వాల్ ఆ తర్వాత 'నువ్వునాకు నచ్చావ్' సినిమాతో తెలుగునాట అరంగేట్రం చేసింది. అంతే, ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాకపోవడంతో హిందీ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తరువాత ఐదేళ్లపాటు పట్టిందల్లా బంగరమే అనేలా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. కెరీర్ మంచి ఊపులో ఉండగా, తెలుగు సినీ పరిశ్రమలోని ఓ సహనటుడితో ప్రేమలో పడింది. వ్యక్తిగత కారణాల కారణంగా 2005లో ఆత్మహత్యా యత్నం చేసింది. అంతే, ఆమె సినీ భవిష్యత్ నాశనానికి నాంది పడింది. 2007లో జరిగినవన్నీ మర్చిపోయి ప్రవాస భారతీయుడు ఉజ్వల్ ను వివాహమాడింది. వ్యక్తిగత కారణాలతో రెండేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. వివాహానంతరం ఆర్తీ అగర్వాల్ స్థూలకాయంతో బాధపడింది. విడాకులు పొందిన తరువాత తెలుగుసినీ ప్రయత్నాలు చేసింది. స్థూలకాయం కారణంగా అవకాశాలు ఆమె తలుపు తట్టలేదు. దీంతో లైపోసక్షన్ ట్రీట్ మెంట్ చేసుకుని తెలుగు సినీ రంగంలో మళ్లీ అడుగుపెట్టింది. ఈసారి కూడా అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో స్వదేశం వెళ్లిపోయింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఒత్తిడితో మరోసారి స్థూలకాయం బారినపడింది. దీంతో ఆమె మరోసారి లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకునేందుకు మొగ్గుచూపింది. రెండు వారాల క్రితం ఆమెకు లైపోసక్షన్ ఆపరేషన్ జరిగింది. ఇది వికటించడంతో ఆమెను పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడిన ఆమె గుండెపోటుతో మృతి చెందింది.