: ఆ కోర్సులకు కోటి రూపాయల గ్రాంట్ ఇస్తామన్నా స్పందించని విద్యాశాఖ!
"ఉపాధిని కల్పించే కోర్సులు పెట్టండి. కోటి రూపాయలు ఇస్తాం" అని ఓ వైపు కేంద్రం ఆహ్వానిస్తుంటే, తెలంగాణ విద్యాశాఖ మాత్రం స్పందించడం లేదు. ఇటీవల రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) నిధులను పూర్తిగా పొందడంలో విఫలమైన టీ-సర్కారు, తాజాగా అవగాహనా లోపంతో కమ్యూనిటీ కళాశాలలను కోల్పోయింది. ఈ సంవత్సరం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సుమారు 100 కమ్యూనిటీ కాలేజీలకు అనుమతి ఇవ్వగా, అందులో తెలంగాణ నుంచి ఉన్నది ఒకే ఒక్కటి కావడం గమనార్హం. వాస్తవానికి డిగ్రీ కాలేజీల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్డ్స్ డిప్లొమా స్థాయిలో ఉపాధి కోర్సుల్ని ఇవి అందిస్తాయి. ఈ కోర్సులను పూర్తి చేయగానే విద్యార్థులకు ఉపాధి లభించేలా చూడటమే వీటి లక్ష్యం. సుమారు 78 కోర్సుల్లో ఎంచుకున్న వాటికి కళాశాలలు ప్రతిపాదనలను సమర్పిస్తే, యూజీసీ అనుమతులిచ్చి, గరిష్ఠంగా రూ.కోటి వరకు నిధులిస్తుంది. యూజీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తే తెలంగాణ నుంచి కేవలం నాలుగు దరఖాస్తులు వెళ్లాయి. అందులో ఒక్క ప్రభుత్వ కళాశాల కూడా లేదు. ప్రైవేటు కళాశాలల్లో ఒకే ఒక్క కాలేజీకి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి అందివస్తున్న అవకాశాల్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం విఫలమవుతోందనే వాదన వినిపిస్తోంది.