: బొత్స సత్తిబాబుకు షాక్... పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన బొత్స సత్యనారాయణకు ఆ పార్టీ అధిష్ఠానం షాకిచ్చింది. గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్న సత్తిబాబును తక్షణమే బహిష్కరించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నుంచి రఘువీరాకు నేటి ఉదయం ఫోన్ సందేశం వచ్చిందట. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు టీడీపీ, వైసీపీల్లో చేరిపోయారు. అయితే రఘువీరా, మరికొంత మంది సీనియర్ నేతలతో కలిసి కాంగ్రెస్ లోనే ఉంటున్న బొత్స, వైసీపీలో చేరిపోయేందుకు సిద్ధమైపోయారు. ఈ నెల 7న ఆయన తన అనుచరగణంతో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనిపై సమగ్ర సమాచారం అందుకున్న పార్టీ అధిష్ఠానం, బొత్స పార్టీని వీడేలోగానే తామే బహిష్కరిస్తే సరిపోతుందని తలచినట్లు సమాచారం. అనుకున్నదే తడవుగా బొత్సను సస్సెండ్ చేయాలని రఘువీరారెడ్డిని ఆదేశించింది.